Pages

Thursday, May 27, 2010

మాస్‌పై పేలిన తూటా గోపీచంద్ "గోలీమార్"


నటీనటులు: గోపీచంద్, ప్రియమణి, రోజా, నాజర్, ఎంఎస్ నారాయణ, షవర్ అలీ, కెల్లీ దోర్జ్, జీవా, గెస్ట్ రోల్‌లో ప్రకాష్ రాజ్


సంగీతం: చక్రి, కథ-స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: పూరీ జగన్నాథ్, నిర్మాత: బెల్లంకొండ సురేష్, బేనర్: శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్



పాయింట్: గంగారామ్ గంగూభాయ్‌గా ఎలా మారాడన్నది పాయింట్



ఈ చిత్రం మొదట్లోనే రామ్‌గోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలియజేసే స్లైడ్‌ను పూరీ జగన్నాథ్ వేశాడు. కథ ముందుగా చెప్పినట్లుగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గురించి. రామ్‌గోపాల్ వర్మ "అబ్‌తక్ చప్పన్" సినిమా రూపొందించారు. అందులో హీరో పాత్రను పూరీ గోపీచంద్‌కు ఆపాదించాడు. దయానాయక్ ప్రేరణగా తెలుగులో సినిమాలు చాలా వచ్చాయి.



అరకులో చాలా పాటలు షూట్ చేశారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందంటున్నారు పూరీ. ఇది ఆయన స్టైల్‌లో ఉంది. కాకపోతే పోలీస్ కథాంశం అనగానే "పోకిరి"ని ఇంకా మర్చిపోలేదు ప్రేక్షకులు, అలాగే పూరీ కూడా ఆ సినిమాను మర్చిపోయినట్లు కనబడలేదు. అదే ప్యాట్రన్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను లాగించేశాడు.



ఇక కథలోకి వెళితే... గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు.



ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది.



ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు. అయితే మధ్యలో పవిత్ర( ప్రియమణి) పాత్ర ఎంటరవుతుంది. మగాళ్లంటే అసహ్యించుకునే ఆమె గంగారామ్ పరిచయంతో ప్రేమలో పడుతుంది. ఈమె తల్లి అరుంధతి( రోజా) తనలాగే తన కూతురు మగాడి చేతిలో మోసపోకూడదని ఆమెను మగ ద్వేషిగా పెంచుతుంది. సినిమాలో వీరిద్దరి ట్రాక్ కథాగమనాన్ని పెంచేదిగా, కాస్త కామెడీగా ఉంటుంది.



ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గోపీచంద్ ఇమిడిపోయాడు. ఆహార్యం, అభినయం సరిపోయాయి. సీరియస్‌గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మానవత్వంగా అనాధలకు సేవ చేస్తుంటాడు. ప్రియమణి పాత్ర నామమాత్రమే అయినా అభినయానికి ఆస్కారమున్న పాత్ర. తాగే సన్నివేశంలో బాగా నటించింది. డేర్ అండ్ డెవిల్‌గా నటించే పాత్రలో రోజా సరిపోయింది. కూతుర్ని కాపాడుకునే క్రమంలో ఆమె చేసే పనులు బాగానే ఉన్నాయి.



నాజర్ డీజీపీగా బాగానే చేశాడు. మాఫియా లీడర్‌గా గతంలో డాన్ చేసిన కెల్లీ ఈ చిత్రంలో అదే తరహాలో కనిపిస్తాడు. కొత్తగా షవర్ అలీ మరో మాఫియా నాయకుడుగా నటించాడు. విలన్ పాత్రలు ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. జీవా పోలీసు అధికారిగా చేశాడు. హోటల్ యజమానిగా ఎమ్మెస్ సరిపోయాడు.



సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నది. చక్రి సంగీతం ఫర్వాలేదు. "సలామ్ లేకుం సలాం" నుంచి స్ఫూర్తిగా తీసుకుని "సలాం పోలీస్‌కు సలాం.." అనే పాట పోలీసును గౌరవించేదిగా ఉంది. మగాళ్లంటే మోసగాళ్లు... అంటూ ప్రియమణి పాడే పాట మగాళ్లపై సెటైర్ అయినా ఎక్స్‌టార్డినరీగా ఏమీ లేదు. కళ్లలో ఏదో గమ్మత్తుగా ఉంది అనే పాట అరబిక్ ట్యూన్‌ను పోలి ఉంది.



సంభాషణలు పొందికగా ఉన్నాయి. "నా కూతుర్ని మదర్‌లా కాదు మదర్ థెరిస్సాలా చూడాలనుకున్నా.... ఇంటిలో ఎలుకలు మనముందే తిరుగుతాయి.. ఏమీ చేయలేం....అందుకే బోను పెడితే ఒక్కోటి చిక్కుతుంది.. అంటూ మాఫియాపై డీజీపి చేసే వ్యాఖ్యలు సందర్భానుసారంగా ఉన్నాయి. ఇక హీరోయిన్ చేత "తొక్కలోది" అనిపించడం యువత ప్రవర్తించే తీరుకు సపోర్ట్ చేసేదిగా ఉంది. పాత్రలన్నీ కథకు సరిపోయేవే అయినా సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో మహిళలను ఆకట్టుకునే అంశాలు లేవు. మాస్‌ను బాగా ఆకట్టుకుంటుంది. పోకిరిలో పోలీసు రౌడీలా మాఫియాలో చేరి రహస్యాలు తెలుసుకుంటాడు. గోలీమార్‌లో పోలీసు, మాఫియాలా ఎందుకయ్యాడో చూపించాడు.



మాఫియాను సినిమాలో చూపించినంత ఈజీగా ఎదుర్కోవడం అసంభవం. సినిమా కాబట్టి ఎంతటి పవర్‌ఫుల్ వ్యక్తులనైనా హీరో వారిని వెంటనే పట్టుకుని కాల్చేయడం.. వారి రహస్యాలు ఈజీగా తెలిసిపోతుండటం జరుగుతాయి. మాఫియా నెట్వర్క్ ఎలా ఉంటుందనేది చిత్రంలో చూపాడు. యాక్షన్ సినిమాలు చూసిన వారిగి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. చూసే వారికి మాత్రం కాలక్షేపం బాగానే ఉంటుంది.

Sunday, May 16, 2010

"రామరామ కృష్ణకృష్ణ" రామరామ కృష్ణకృష్ణలానే ఉంది..!!


నటీనటులు: రామ్, ప్రియా, ఆనంద్, బిందుమాధవి, అర్జున్, నాజర్, వినీత్ కుమార్, బ్రహ్మానందం, షిండే, శ్రీనివాసరెడ్డి తదితరులు


మాటలు: ఎం.రత్నం, కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: కీరవాణి, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: రాజు, కథ - స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్



పాయింట్: పట్టింపులు పంతాలు గల ఇంటిలో తన సోదరుని పెళ్లి చేయడానికి తమ్ముడు ఎన్ని జిమ్మిక్కులు చేసి తండ్రిని ఒప్పించాడనేది కథ



రామ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో రెడీ సినిమా వచ్చింది. అంతకుముందు హీరో విష్ణు ఢీ అనే సినిమా కూడా వచ్చింది. ఈ రెండింటిలో తను ప్రేమించిన ప్రియురాలు దగ్గరే ఉంటూ వాళ్లవాళ్ల ఇంటిలో ఎవరికీ తెలీకుండా కథ నడుపుతాడు హీరో. రామరామ కృష్ణకృష్ణలో కూడా అదే తరహాలో సాగుతూ... తన సోదరుని ప్రేమ వ్యవహారాన్ని చక్కబెడుతూ... పనిలోపనిగా ప్రేమను పొందుతాడు ఈ హీరో.



కథ గురించి చెప్పాలంటే... రామకృష్ణ(రామ్) ఆ ఊరిలో డేరింగ్ పనులు చేస్తుంటాడు. తండ్రి చక్రపాణి( నాజర్) ఊరికి పెద్ద. కట్టుబాట్లకు పెద్దపీట వేసే చక్రపాణికి ప్రేమ వివాహాలు గిట్టవు. ఇందుకు సొంత సోదరుడు బ్రహ్మానందాన్ని కూడా దూరం చేసుకుంటాడు. అలాంటి ఊరిలో శివరాజ్( అర్జున్) తన ఇద్దరు చెల్లెళ్లతో కాలంగడుపుతుంటాడు. అందులో పెద్ద చెల్లెల్ని రామ్ సోదరుడు ప్రేమిస్తాడు. ఇద్దరూ సిటీలో డాక్టర్ కోర్సు చదువుతుంటారు.



నాన్న విషయం తెలిసిన రామ్ వారిద్దరి పెండ్లి తాను దగ్గరుండి జరిపిస్తానని భుజాలపై వేసుకుంటాడు. అనుకున్నట్లుగానే రకరకాల తెలివితేటలతో పెండ్లి పీటల దాకా తెస్తాడు. ఆ సమయంలో ముంబై డాన్ పవర్( వినీత్ కుమార్) అనుచరులు రామ్ కోసం విలేజ్ వచ్చి టార్గెట్ చేస్తారు. ఇది శివరాజ్‌కు తెలిసి రామ్‌ను ఎలా కాపాడాడు..? అసలు ముంబై డాన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు..? అన్నది సినిమా.



అసలు కథ ముంబై నుంచి ప్రారంభమై గోదావరి ప్రాంతంలో ముగుస్తుంది. ముంబైలో డాన్‌గా అర్జున్ ఎలా మారాడు అన్న దానిలో క్లారిటీ ఉంది. అటువంటి వ్యక్తి వల్లే తన భార్య చనిపోవడంతో ఆమె చివరికోరిక మేరకు ఆ కూపం నుంచి బయటపడి గోదావరి ప్రాంతానికి వస్తాడు. ఆయన అనుచరులు బెనర్జీ, మురళి సరిపోయారు. ఆ ఎపిసోడ్ భాషా చిత్రాన్ని తలపిస్తుంది.



కథను మాఫియాతో లింక్ చేసి చూపే విధానం కూడా ఫర్వాలేదు. అక్కడ బ్రహ్మానందం ముస్లిం ఆమెను వివాహం చేసుకుని సెటిల్ కావడం... రామ్ తన సోదరుడు ప్రేమించిన అమ్మాయి పెండ్లి చేసి తీసుక వచ్చేందుకుగాను బాబాయ్ బ్రహ్మానందం దగ్గరకు వెళతాడు. ఇక ఆ తర్వాత మాఫియాతో రామ్ ఎదుర్కొన్న యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాటిక్‌గా ఉంటాయి.



ముంబైలో పేరుమోసిన మాఫియా లీడర్ పవార్‌ను, ఆయన అనుచరులను తుపాకులతో కాల్చడం, ముంబై వీధుల్లో వారి నుంచి తప్పించుకోవడం అనేవి కాస్త కృతకంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో వాళ్లందరినీ కత్తులతో నరకడం వంటివి మగధీర చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. అసలు అంత హింస ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. అర్జున్ భార్య గ్రేసీ సింగ్ చనిపోవడం, రామ్‌కోసం స్వామీజీలు వెతకడం అనేది బంగారు బుల్లోడులోని కొన్ని సన్నివేశాలు గుర్తుకు తెస్తాయి. మొత్తంగా అవీఇవీ కలిపి ఒక సినిమాగా తయారు చేశాడు దర్శకుడు శ్రీనివాస్. లక్ష్యం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది.



విలన్‌గా వినీత్ కుమార్ కొత్తదనంకోసమే తెచ్చినట్లుంది మినహా ప్రత్యేకత ఏమీలేదు. సినిమాటోగ్రఫీపరంగా బాగానే ఉంది.సంగీతపరంగా కీరవాణి మైనస్సనే చెప్పాలి. దరువుల మోతతో సాహిత్యం అర్థం కాకుండా పోయింది. మెలోడి సంగీతాన్ని సమకూర్చే కీరవాణి మాస్‌ను కూడా టచ్ చేయగలనని ముందడుగు వేశాడు. బిందుమాధవి పాత్ర హీరో వెంటపడుతూ... కాస్త మాస్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సరిపోయింది. భార్య రాత్రి పక్కలో లేకపోతే తట్టుకోలేని విధంగా బ్రహ్మానందం మాస్‌ను ఆకట్టుకోవచ్చునేమోగానీ ట్రెండ్ వెర్రిపోకడలకు దారితీస్తున్నట్లు కనబడుతుంది.



తను హీరోను ప్రేమించిన విషయం తన అన్న అర్జున్‌కు తెలిసినా ఏవో చిన్నపాటి గొడవలతో ఆమెకు వేరే సంబంధం చూసి పెండ్లి పీటలపైకి తేవడం... హీరో దేవదాసులా మారడం... చివర్లో హీరో గురించి అన్న తెలుసుకోవడం... కథ సుఖాంతం కావడం... ఇలా రొటీన్ తంతు రామరామ కృష్ణకృష్ణలో కూడా ఉంది.



గోదావరి ఎపిసోడ్ చిత్రానికి కాస్త రిలీఫ్ ఇచ్చిందనుకోవాలి. మాఫియాను ఎదుర్కొనే సన్నివేశాలు కాస్త బరువుగా ఉంటాయి. మొత్తంగా ఇది ఓ మోస్తరు సినిమా మాత్రమే.

Sunday, May 2, 2010

దుష్ట శిక్షణకు వైద్యుడే.. నర "సింహా"వతారం ఎత్తితే..!?


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, నయనతార, నమిత, స్నేహాఉల్లాల్, కె.ఆర్‌.విజయ, మలయాళ నటుడు సాయికుమార్‌, హేమంత్‌, శ్రావణ్‌, జీవీ, కిన్నెర, కోటశ్రీనివాసరావు, వేణుమాధవ్‌, బ్రహ్మానందం, ఝాన్సీ, అలీ, కృష్ణభగవాన్‌, ఎల్బీశ్రీరామ్‌, ఆనందభారతి తదితరులు.


సంగీతం: చక్రి,

నిర్మాత: పరుచూరి కిరిటీ,

బేనర్‌: యునైటెడ్‌ మూవీస్‌,

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


పాయింట్‌: మనిషికి వ్యాధి సోకితే వైద్యం చేసే వైద్యుడు సమాజాన్ని పాడుచేసే వైరస్‌కు (దుష్టులను) ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడనేదే పాయింట్.



టైటిల్‌ వినగానే నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సమరసింహారెడ్డి- ఇలా సింహా సెంటిమెంట్‌తో మళ్ళీ బాలకృష్ణ విజృంభిస్తాడని ముందుగానే చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను అటువంటి తరహా కథతో ముందుకువచ్చాడు. ఇది పక్కా బాలయ్య మార్క్‌ సినిమా.



ఇన్నాళ్ళు ఎలాంటి కథాశంతో అభిమానుల్ని సంపాదించుకున్నాడో అలాంటి అభిమానులు మెచ్చేలా, వారి అంచనాలకు అనుగుణంగా బాలయ్య కథాంశాన్ని ఎంచుకున్నాడు. దీనికితోడు నాలుగు పాటలుకూడా బాగుండడంతో సింహా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌‌ అయ్యింది.



అయితే భద్ర, తులసిలో ఉన్నట్లే... దర్శకుడు బాలయ్య రేంజ్‌కు తగినట్లుగా బాంబు పేలుళ్లు, కత్తులతో నరకడాలు మామూలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్‌లు ఆవేశంగా 'లంజకొడకా..' అంటూ ఉన్నా సన్నివేశపరంగా కొట్టకుపోయాయి. కాకపోతే వయొలెన్స్‌ ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని హ్యుమన్‌రైట్స్‌ సంస్థలు వేలెత్తిచూపుతాయోనని చిన్నపాటి సందేహంకూడా ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక.. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య మెప్పించాడు.




కథలోకి వెళితే...? విజయనగరం జిల్లా బొబ్బిలిలో రెండే పెద్ద కుటుంబాలు. అందులో ఒకటి నరసింహా (బాలకృష్ణ) కుటుంబం. మరొకటి కోటశ్రీనివాసరావు కుంటుంబం. వీరిలో నరసింహా చెడును ఏ మాత్రం సహించడు. ప్రజలకు మంచిచేయాలనుకుంటాడు. కానీ కోటశ్రీనివాసరావు కుటుంబం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది.



ప్రజలు ఏమైనా పర్వాలేదు. వారందరూ తాము చెప్పినట్లే వినాలి. పోలీసువ్యవస్థను కూడా చేతుల్లో తీసుకుని కోటశ్రీనివాసరావు బోలెడు అరాచకాలు చేస్తుంటాడు. ఇది సహించని నరసింహ వారికి బుద్దిచెప్పే క్రమంలో కోట కొడుకుల్లో ఇద్దరిని చంపేస్తాడు. దీంతో పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న కోటశ్రీనివాసరావు మరో కొడుకు సాయికుమార్‌, నరసింహ కుటుంబాన్ని తుదముట్టిస్తాడు.



కానీ అందులోని వంశోద్ధారకుడు శ్రీమన్నారాయణ (బాలకృష్ణ)ను నాయనమ్మ కె.ఆర్‌. విజయ రహస్యంగా తప్పించి హైదరాబాద్‌ సిటీకి వచ్చి పెంచుతుంది. పెద్దవాడయిన శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్‌. ఆయనలోనూ అదే పోకడ. చెడును సహించడు. ఈ క్రమంలో ఈవ్‌టీజింగ్‌, డ్రగ్స్‌కు బానిసలైన యువకులకు బుద్ధిచెబుతాడు.



ఆ క్రమంలో జానకి (స్నేహ ఉల్లాల్‌) అనే స్టూడెంట్‌ను వదిన అని సంబోధిస్తూ.. ఓ రౌడీ తన అన్న రమ్మంటున్నాడని బలవంతంగా తీసుకెళతాడు. ఆ రౌడీ నుంచి స్నేహాఉల్లాల్‌ను శ్రీమన్నారాయణ కాపాడి, ఆమె ఫ్యాష్‌బ్యాక్‌ తెలుసుకుని తను ఆశ్రయమిస్తాడు.



జానకి ఉన్న విషయాన్నితెలుసుకుని ఆమె తండ్రి రఘు వచ్చి అనుకోకుండా అక్కడ జరిగే గొడవల్లో శ్రీమన్నారాయణను పొడవబోయి బామ్మను పొడుస్తాడు. కసితో రఘును కత్తితో పొడుస్తుండగా బామ్మ వారిస్తుంది. అసలు రఘు ఎవరు..? శ్రీమన్నారాయణ ఎవరు..? జానకి ఎవరు..? అనే విషయాలు తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.



ఇందులో కాలేజీ ప్రొఫెసర్‌ ఎపిసోడ్‌ మొదటి భాగంగా.. బొబ్బిలి ఎపిసోడ్‌ రెండో భాగంగా వస్తుంది. బాలకృష్ణ ప్రొఫెసర్‌గా సూటయ్యాడు. అదేవిధంగా నరసింహా పాత్రలోనూ ఇమిడిపోయాడు. డైలాగ్‌ డెలీవర్‌లో కొత్తగా కన్పించాడు. లెంగ్తీ డైలాగ్‌లు లేకుండా సింపుల్‌గా ఉన్నా, ఇందులోనూ తన వంశం గురించి ప్రస్తావించే సంభాషణలు చొప్పించారు.



ఆయన భార్యగా నయనతార నటించింది. ఇంతకుముందు చిత్రాల్లో ఓ మోస్తరు బొద్దుగా ఉండే నయనతార చాలా తగ్గింది. బామ్మగా కె.ఆర్‌. విజయ పాత్రకు సరిపోయింది. స్నేహ ఉల్లాల్‌ తండ్రిగా రఘు నటించాడు. పనివాళ్ళుగా ఝాన్సీ, బ్రహ్మానందం నటించారు. విజయనగరం యాసను ఝాన్సీ సునాయాసంగా పలికింది.



అలీ, కృష్ణభగవాన్‌‌ పాత్రలు కాస్త నవ్విస్తాయి. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ పడిపోతే వారి ఎలాంటి జీవనం సాగిస్తారనేది అలీ పాత్ర ద్వారా దర్శకుడు చక్కగా చూపాడు. కాలేజీ లెక్చరర్‌గా నమిత కాస్త గ్లామర్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసింది.



ఇకపోతే ఈ సినిమాకు కెమెరా పనితనం ప్రత్యేక ఆకర్షణ. సిరివెన్నెల, చంద్రబోస్‌ పాటలు అలరించాయి. "సింహంలాంటి చిన్నోడు వేటకొచ్చాడు.." అనే మాస్‌ పాట ఆకట్టుకుంది. "బంగారుకొండ మువ్వులదండ.." అనే పాట నయనతార, బాలయ్యతో చిత్రించినా సందర్భానుసారంగా ఉంది.



కథ సీరియస్‌గా నడుస్తుండగా.. 'జానకి జానకి.. అని సాగే చివరి పాట బ్రేక్‌లా వేసి.. ప్రేక్షకుల్ని డైవర్షన్‌ చేసి కాస్త రిలీప్‌ ఇచ్చాడు. అయినా ఇది అడ్డంకిగా ఉంది. సంభాషణలు పొందికగానే ఉన్నాయి. 'డాక్టర్‌కు కుట్లు వేయడమేకాదు. పోట్లు వేయడం కూడా తెలుసు.. వంటి కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.



మొత్తానికి ఇది బాలయ్య ట్రేడ్‌ చిత్రం. 'మిత్రుడు' అంతటి ఫ్లాప్‌ తర్వాత బాలయ్య ఎటువంటి సినిమా చేస్తాడనేది ఫ్యాన్స్‌లోనూ ప్రేక్షకుల్లోనూ నెలకొన్న ఉత్కంఠకు "సింహా" ద్వారా తెరదించాడు. మంచి కథా వస్తువుతో బాలయ్య మెప్పించాడు. ఇంకేముంది..? మరి.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ రేంజ్‌కు తీసుకుకెళ్ళాతారో..? వేచి చూడాల్సిందే..!?