Pages

Wednesday, April 28, 2010

పెళ్లి పీటలపైనే "వధువు"ను చూస్తాననే "వరుడు" ఉంటాడా...?!!


నటీనటులు : అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా, ఆర్య, సుహాసిని, ఆశిష్ విద్యార్థి, షాయాజీషిండే, నాజర్, నరేష్, విజయ, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరావు, అనితా చౌదరి, బ్రహ్మానందం తదితరులు. సినిమాటోగ్రఫీ : ఆర్.డి, రాజశేఖర్, సంగీతం : మణిశర్మ, ఎడిటింగ్ : ఆంథోని, ఫైట్స్ : స్టన్ శివ, మాటలు : తోట ప్రసాద్, నిర్మాత : డి.వి.వి. దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గుణశేఖర్.పాయింట్ : మంచి సంతానంతో సమాజానికి మేలు చేకూరుతుంది. అక్రమ సంతానంతో సమాజానికి కీడు కలుగుతుందన్న విషయాన్ని గుణశేఖర్ "వరుడు"లో చూపించాడు.కథ : ప్రేమించి పెళ్లిచేసుకున్న వసు (సుహాసిని), గోపి (ఆశిష్ విద్యార్థి) సంతానమే సందీప్ ఉరఫ్ సాండీ (అల్లు అర్జున్). ఇతడికి స్నేహితులతో కలిసి పబ్‌ల్లో ఎంజాయ్ చేయడం మామూలైన విషయం. కానీ పెళ్ళి మాత్రం సాంప్రదాయంగా పెద్దలు కుదిర్చిన వారినే చేసుకుంటాననే నైజం. అది ఎలాగంటే..? తన తాతలు చేసుకున్న వందేళ్ళనాటి పద్ధతి ప్రకారం 16 రోజుల కార్యక్రమంలో ఐదు రోజులు పెళ్ళి తంతు ఉండాలన్నది అతని కోరిక. అప్పట్లో పెళ్ళి కూతుర్ని పీటలపైనే చూసేవారు. అలాగే తనూ చూస్తానని తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్ళికి సిద్ధమవుతాడు సాండీ.పెళ్లికూతురు పేరు దీప్తి (భానుమెహ్రా). ఆమెకూ ఇవే భావాలుంటాయి. గంతకు తగ్గ బొంతలా కుదురుతుంది. సరిగ్గా పెళ్ళిపీఠలపై కూర్చుని జీలకర బెల్లం పెడుతుండగా మంటపం కూలిపోవడం, పెళ్లికూతురు అపహరణకు గురవడం జరుగుతుంది. అపహరణ చేసింది దివాకర్ (ఆర్య), అతనో సైకో. అక్రమసంతానం వల్ల పుట్టినవాడు. సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టించాలో అలా పట్టిస్తుంటాడు. పోలీసులు కూడా అతని ఆగడాలని అరికట్టలేకపోతారు. వాడి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న సందీప్ వాడిని ఎదిరించి వాడికళ్ళముందే అదే పెళ్లిమండపంలో ఎలా పెళ్లిచేసుకున్నాడు? అడ్డువచ్చిన దివాకర్‌ను ఎలా అంతమొందించాడు అన్నది "వరుడు" సినిమా.అల్లు అర్జున్ వయస్సుకు తగ్గట్లుగా బాడీలో ఎనర్జీ పాళ్లు ఎక్కువే. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ (కొంత గ్రాఫిక్స్ అయినా) అది కనపడింది. డైలాగ్ మాడ్యులేషన్ ఎమోషన్‌లో సరిగ్గా సూటుకాలేదు. కానీ వరుడుగా బాడీని కావాల్సినంత ఎక్స్‌ఫోజ్ చేసి ఒక వర్గాన్ని మెప్పిస్తాడు. హీరోయిన్ ఎవరా? అని గోప్యంగా ఉంచి అమృత్‌సర్ అమ్మాయిని చూపించారు. పెళ్లితంతులో ఆభరణాలు, మేకప్‌లో కళ్లకు బాగానే అనిపించింది. కాలేజీ చదివే ఎపిసోడ్‌లో మాత్రం అంత అందం కనబడదు. నార్మల్ గాళ్‌గా ఉంది. ఆమెకు హీరోతో కొద్దిపాటి డైలాగ్స్ మినహా పెద్దగా ప్రాధాన్యత లేదు. దివాకర్ పాత్రలో ఆర్య ఆకట్టుకున్నాడు. అతనిది సైకో పాత్ర. తనకు అడ్డూఅదుపులేకపోతే ఎలా ఉంటాడో చూపాడు. నాటకాలపిచ్చి. కోరింది దక్కకపోతే సహించడు. కామంతో రగిలిపోతుంటాడు. కూష్మాండా అంటూ.. తను నాటకాల్లో వేసిన పాత్రను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెడుపనులు చేస్తుంటాడు. పూర్తిగా ఎమోషనల్ పాత్ర. విలన్‌గా కథాపరంగా సూటయ్యాడు. ఇక సందీప్ తల్లిదండ్రులు, దీప్తి తల్లిదండ్రుల పాత్రలు రొటీన్. తాతగా సింగీతం శ్రీనివాసరావు నటించాడు. దర్శకుడిగా తను పాత్రల నుంచి ఏ మేరకు రాబట్టుకోవాలో ఆయనకు తెలుసుకానీ, తనే నటుడైతే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలిసిందనుకోవచ్చు. సన్నివేశపరంగా డైలాగ్‌లు చెప్పడంలో.. ఫీలింగ్ ఉండేలా అనిపించవు.ఇక బ్రహ్మానందం పెళ్ళిళ్ల పేరయ్య ఎపిసోడ్ కామెడీకోసం పెట్టినా అది వెగటు పుట్టిస్తుంది. సునీల్, అలీ పాత్రల్ని ఒక పాటలో మినహా ఉపయోగించుకోలేకపోయారు. మొత్తంగా పెళ్ళితంతులో హాస్యం మిస్సయ్యింది. మధ్యమధ్యలో బంధువులంతా కలిసి చమక్కులతో విసిరిన సామెతలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాకు ఈ ఎపిసోడ్ కామెడీకి ప్రాణం. కామెడీని గుణశేఖర్ సరిగ్గా డీల్‌ చేయలేకపోయాడనిపించింది. నిన్నే పెళ్ళాడుతాలో.. సీనియర్ నటీనటులతో హాస్యం పండించినంతగా చేస్తే బాగుండేది. కానీ "వరుడు"లో పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కొత్త వారే. షాయాజీ షిండే హోం మంత్రిగా నటించాడు. నాజర్, రావురమేష్ పోలీసు అధికారులుగా చేశారు.పెళ్ళితంతులో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన సాహిత్యం సినిమాలో హైలైట్ అవుతుందన్న దర్శకుడి మాట నిలబడలేదు. ఒక్కపాటలోనే 16రోజుల తంతును చూపించే ప్రయత్నం చేశాడు. మినహా.. ఏ రోజు ఏం చేస్తారో చూపించలేకపోయారు.మణిశర్మ బాణీలు గుర్తిండిపోయేలా లేవు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్ ఎమోషనల్‌గా సాగుతూ.. ఆసక్తి కలిగించినా కాసేపటికి హీరో ఎత్తైన శిఖరంపై ఉండి ఫైట్ చేయడం విడ్డూరంగా ఉంది. బహుశా అప్పటికే ఎక్కువ ఎక్స్‌పోజింగ్ అయిపోయిందని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. పెళ్ళి గురించే గుణశేఖర్ చెప్పినా.. అందులో అన్ని సరిగ్గా అమరకపోతే పెళ్లెలా పేలవంగా ఉంటుందో ఈ సినిమాకూడా అలాగే ఉంది. ప్రధానంగా హాస్యం లేదు. సునీల్, అలీ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. వారు గెస్ట్‌గా పాటలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. అలాగే పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసే సన్నివేశం బలంగా లేదు. దాంతో కామపిశాచిగా ఆర్య ముద్రపడిపోయాడు. మొదటి నుంచి ఇంటర్‌వెల్ వరకు సీరియల్‌గా కథ నడవదు. సెకండాఫ్‌లో విలన్ ప్రవేశంతో ఎమోషనల్‌గా ఉన్నా స్క్రీన్‌ప్లే లోపంతో ట్రాక్ తప్పింది. కొంతమేరకు సాగదీసినట్లుంది. "సైనికుడు" తర్వాత గుణశేఖర్ నుంచి వచ్చిన "వరుడు" అంత నిరాశపరిచినా.. ప్రస్తుతానికి పెద్ద సినిమాలు ఏమీలేకపోవడంతో కొద్దిరోజులైనా ఆడుతుందనేది మాత్రం నిజం.

శ్రీశ్రీ స్ఫూర్తితో శర్వానంద్ రాజకీయ "ప్రస్థానం"


నటీనటులు: శర్వానంద్, రూబీ పరిహార్, సాయికుమార్, సందీప్, జీవా, జయప్రకాష్ రెడ్డి, సురేఖావాణి, వెన్నెల కిషోర్, రేష్మ, మాస్టర్ అతులిత్ తదితరులు. సాంకేతిక సిబ్బంది : కెమెరా-శ్యామ్ దత్, సంగీతం : మహేష్ శంకర్, నిర్మాత : వల్లభనేని రవి, ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల, కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : దేవకట్టా.మనిషి "ప్రస్థానం" ఎలా ఉంటుందో తన కవిత్వంలో చొప్పించాడు శ్రీశ్రీ. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కథ అల్లాడు దర్శకుడు దేవకట్టా. ఎన్నారై అయిన దేవకట్టా తొలిసారిగా తన స్నేహితులతో కలిసి "వెన్నెల" అనే చిత్రాన్ని తీసి మెప్పించాడు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తీసుకుని కథపై అవగాహనతో ముందుకు వచ్చాడు. అదే "ప్రస్థానం"గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషిలో అసూయద్వేషాలు, కోపతాపాలు, కుటుంబంలో ఒకరు ఎక్కువ, తక్కువ అనే స్వభావాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే విషయాన్ని సజీవ పాత్రల ద్వారా చూపారు. ఇందులో నటీనటులు అందరూ బాగానే చేశారు. శర్వానంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. "గమ్యం" తర్వాత శర్వానంద్‌కు అంతపేరు వస్తుంది. ఇదే కథతో పేరున్న హీరో అయితే సినిమా రేంజే వేరుగా ఉండేది. కథను పూర్తి సీరియస్‌గా తెరకెక్కించిన దేవకట్టా సఫలీకృతుడయ్యాడు. కథలోకి వెళితే.. విజయవాడ నేపథ్యాన్ని దేవరకట్టా ఎంచుకున్నాడు. కృష్ణాజిల్లా మానికొండలో పలుకుబడి కలిగిన రాజకీయనాయకుడు పెద్దాయన (బాలయ్య). ముఠా కక్షల్లో సొంత కొడుకును కేశవ (రవిప్రకాష్)ను కోల్పోతాడు. కేశవ ఆప్త మిత్రుడైన లోకనాధం నాయుడు ఉరఫ్ లోకి (సాయికుమార్). పెద్దాయన కోరిక మేరకు చనిపోయిన మిత్రుడు భార్యను పెళ్లాడటమేగాక, తన మిత్రుని సంతానానికి సవతి తండ్రి అవుతాడు. కాలగమనంలో లోకి కుటుంబం విజయవాడకు మారడంతో లోకి రాజకీయ శక్తిగా ఎదిగి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు. కొడుకు మిత్ర (శర్వానంద్) తండ్రి రాజకీయ వారసత్వంతో యువనేతగా ఎదుగుతాడు. కానీ కూతురు (సురేఖావాణి) డాక్టర్. లోకిని తండ్రిగా భావించదు. మరోవైపు లోకి స్వంత కుమారుడు చిన్న (సందీష్ కిషన్) మిత్ర ఎదుగుదలను చూసి అసూయకులోనై సైకోగా మారుతాడు. భారతంలో భీష్ముని తరహా పాత్రలో సాయికుమార్ నటించాడు. ఆ పాత్రకు, మిత్రా, సైకో చిన్నా ఈ ముగ్గురి జీవన ప్రస్థానం ఏ మేరకు సాగింది? ఇందులో సైకో ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడు? అనేది సినిమా. పాత్రపరంగా అందరూ బాగానే చేశారు. సాయికుమార్ తలపండిన రాజకీయనాయకుడిగా నప్పాడు. ఆయన వాయిస్ థియేటర్లలో ఖంగుఖంగుమని మోగుతుంది. ఆవేశ, శాంత స్వభావ విన్యాసాలు బాగా చేశాడు. శర్వానంద్ సీరియస్‌గా మాస్ తరహా పాత్రను మెప్పించాడు. చెప్పుకోదగిన పాత్ర ఛోటాకేనాయుడు మేనల్లుడు సందీప్ విలన్‌గా బాగా చేశాడు. ఇంకా నవ్యత గల కథ. దేవకట్టా ప్రతి పాత్రను తెరపై మలిచిన వైనం బాగుంది. పాత్రోచితంగా రాసుకున్న స్క్రీన్‌ప్లే, సంభాషణలు ప్రస్థానానికి ప్రాణవాయువు. మంచి చెడులది ఒక్కోసారి పై చేయి.శాందత్ కెమెరా, మహేష్ శంకర్ సంగీతం బాగున్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. మొత్తానికి ఈ వారం విడుదలైన చిత్రాల్లో "ప్రస్థానం" ఉత్తమ చిత్రంగా నిలిచింది.

Saturday, April 24, 2010

ఈ "మరోచరిత్ర" అలనాటి "మరోచరిత్ర" కాదు


నటీనటులు: వరుణ్ సందేశ్, అనిత, శ్రద్దా దాస్, ప్రతాప్ పోతన్, ఊర్వశి, ఆదర్శ్, నరేష్, వేణు, కోట శ్రీనివాసరావు తదితరులు మాటలు: ఉమర్జీ అనురాధ, కథ: కె. బాలచందర్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: రవి యాదవ్, సంగీతం: మిక్కీజే మేయర్.ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే... గతంలో కె. బాలచందర్ తీసిన "మరోచరిత్ర" ప్రస్తావనను తీసుకరావాల్సిందే. కమల్ హాసన్, సరిత కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని యథాతధంగా ఇప్పటి జనరేషన్‌కు అన్వయించి దిల్ రాజు తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ముందుగానే... ఎందుకైనా మంచిదనీ... అలనాటి "మరోచరిత్ర"తో పోల్చుకోకండి. జస్ట్ ఫీల్‌ను మాత్రమే చేయండి అని స్లైడ్ వేశారు.కథగా చెప్పాలంటే... అమెరికాలో నివశించే కృష్ణమాచారి (ప్రతాప్ పోతన్)కు బాలు (వరుణ్ సందేశ్) ఒక్కగానొక్క కొడుకు. బాలు తను చదువుతున్న కోర్సును మధ్యలోనే ఆపేసి ఇంటికి వస్తాడు. పక్క ఇంట్లో ఉండే అమెరికా దుర్గ(ఊర్వశి) కుమార్తె స్వప్న(అనిత)ను మొదటి చూపులోనే ప్రేమించేస్తాడు. స్వప్న చాలా సన్నిహితంగా ఉంటూ... తన ఇంటిలోని విషయాలన్నీ ఓపెన్‌గా చెప్పేస్తుంటుంది. ఆల్రెడీ, కృష్ణమచారికి, అమెరికా దుర్గకు పడదు. కనుక వీరిద్దరి ప్రేమను అంగీకరించే సమస్యే లేదు. ఆ తర్వాత పోలీసైన పౌల్ శాస్త్రి( నరేష్) మధ్యవర్తిత్వంతో ప్రేమ వ్యవహారాన్ని ఓ ఏడాదిపాటు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందం ప్రకారం ఇద్దరూ ఏడాదిపాటు కలుసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉంటే పెద్దలు అంగీకరించాలి. ఇక ఏడాది తర్వాత ఇద్దరూ కలుసుకున్నారా...? లేదా...? అనేది ఈ మరోచరిత్రపాత్రపరంగా ఇద్దరూ ఎన్ఆర్ఐలు కావాలని స్వతహాగా ఎన్ఆర్ఐలు అయిన వరుణ్ సందేశ్, అనితలను ఎంపిక చేశారు. వరుణ్ సందేశ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేశాడు. ప్రేమను వ్యక్తం చేసి మళ్లీ విరహంగా సాగే కీలక సన్నివేశాల్లో మాత్రం అతని నటన నప్పలేదు. ఇక అనితకు ప్రధాన సమస్య డబ్బింగ్... అయితే ఆమె చూపుల్లో సెక్సప్పీల్ కనిపిస్తోంది. నిజమైన ప్రేమికురాలిగా ఒక్క సన్నివేశంలో మినహా మిగిలినచోట్ల అతకలేదు. శ్రద్దాదాస్ పాత్ర రొటీన్ గానే ఏదో ఎక్స్ ట్రా పాత్ర మేరకే ఉంది. ప్రతాప్ పోతన్, కోట, ఊర్వశి, తమ తమ పాత్రలను పండించారు.స్వతహాగా కెమేరామెన్ అవడం వల్ల రవియాదవ్ నైపుణ్యం ఇందులో మెచ్చుకునే స్థాయిలో ఉంది. మిక్కీజే మేయర్ సంగీతం బాగానే ఉంది. కథను నడిపే విధంగా స్క్రీన్ ప్లే లేదు. కాస్త గందరగోళంగా కనిపిస్తుంది. దిల్ రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. క్లాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. మొదటి భాగమంతా ఫర్వాలేదనిపించినా రెండో భాగంలో కాస్త నిదానించి సన్నివేశాలు అతుక్కుపోవడంతో కాస్త గందరగోళంగా ఉంది. వెరసి ఈ చిత్రం అలనాటి మరోచరిత్రను చూసిన వారికి ఏ మాత్రం నచ్చదు. కొత్తగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన లవ్ స్టోరీ ఇది

ఒట్టు... అర్థ భాగం అబద్ధం "డార్లింగ్" review


నటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్దా ఆర్య, తమళి హీరో ప్రభు, తులసి, చంద్రమోహన్, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్ నారాయణ, రాజీశ్రీధర్ తదితరులుసాంకేతిక సిబ్బంది:- మాటలు: స్వామి, సంగీతం: జి.వి ప్రకాష్, కెమేరా: ఆండ్రూ, నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కరుణాకరన్పాయింట్: చిన్ననాటి స్నేహితుల పిల్లలు ప్రేమలో పడి యుక్త వయస్సులో ఒకటయితే ఎలా ఉంటుందనేది.మాస్ చిత్రాలు ప్రభాస్‌కు "డార్లింగ్" క్లాస్ తరహా మూవీ. ఎక్కువ కష్టపడకుండా స్ట్రెయిటిష్‌గా లాగించేశాడు. భిల్లా ఒక రకమైన క్లాస్ అయితే ప్రేమలో క్లాస్ ఎలా ఉంటుందో డార్లింగ్‌లో చూపాడు. మొదటి భాగం ప్రభాస్ కల్పిత కథతో ఇంటర్‌వెల్ పడుతుంది. రెండో భాగం ఆ కల్పితం నిజమయితే ఎలా ఉంటుంది..? అనేది కొన్ని ట్విస్టులతో కరుణాకరన్ చూపాడు.కథ ప్రారంభం... 1980లో బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్.. అందులో ప్రభు, చంద్రమోహన్, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ ఒకే కాలేజీలో స్నేహితులు. ఫేర్వెల్ అయ్యాక మళ్లీ కలుసుకోలేమని బాధపడుతూ విడిపోతారు. ఎవరెంత పొజిషన్లో ఉన్నా అంతా ఒక్కసారి కలవాలనేది వారి ఒప్పందం. అప్పుడే ఆహుతి ప్రసాద్ కుమార్తె నందిని( కాజల్ అగర్వాల్), ప్రభు కొడుకు ప్రభాస్( ప్రభాస్) డాన్స్ మెచ్చుకుని అతనికి ఫ్యాన్ అవుతుంది. కట్ చేస్తే... వివిధ ప్రాంతాల్లో ఎవరికి వారు స్థిరపడతారు. ప్రభాస్ తండ్రి హైదరాబాదులో ఉంటే.. నందిని కుటుంబం స్విట్జర్లాండులో ఉంటుంది. ప్రభాస్ హైదరాబాదులో డాన్స్ ట్రూప్ మెయిన్‌టైన్ చేస్తుంటాడు. శ్రీనివాస రెడ్డి, రాజా శ్రీధర్ మరో ఇద్దరు స్నేహితులు. ఆ గ్రూపులో శ్రద్దా ఆర్య కూడా ఉంటుంది. ప్రభాస్‌ను ప్రేమిస్తున్నానంటే.. నాకా ఉద్దేశం లేదంటాడు. దీంతో కలత చెంది ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుంది. ఈ విషయం తెలిసిన గూండా అయిన ఆమె తండ్రి ముఖేష్ రుషి ప్రభాస్‌ను నిలదీస్తాడు. తను స్విట్జర్లాండులో నందిని అనే అమ్మాయిని ప్రేమించాననీ, ప్రేమను వ్యక్తం చేసే టైమ్‌లో ఆమెకు యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిందని కథ చెపుతాడు. దాంతో గూండా కరిగిపోయి ప్రభాస్‌ను వదిలేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ తండ్రి స్నేహితులు తమ కుటుంబాలతో గెట్ టుగెదర్‌లా అరకులో కలుస్తారు. నందినికోసం వచ్చిన ప్రభాస్‌కు అక్కడ మరో స్నేహితుడైన ఎమ్మెస్ కొడుకు రుషి నందినిని పెండ్లి చేసుకోవానుకుంటున్నాడని తెలుసుకుంటాడు. ఆ పెండ్లి తన భుజాలపై వేసుకుంటాడు ప్రభాస్ తండ్రి. షాక్‌కు గురయిన ప్రభాస్ అక్కడ నుంచి వెళ్లి పోతుండగా ఎమ్మెస్ వచ్చి రుషి అసలు తన కొడుకు కాదని ట్విస్ట్ ఇస్తాడు. అప్పుడు ప్రభాస్ ఏం చేశాడు...? కాజల్ ఎవరికి దక్కింది..? అనేది తెరపై చూడాల్సిందే. నటనాపరంగా ప్రభాస్‌కు మార్కులేయాల్సిందే. చాలా సాఫ్ట్‌గా ఉంటూ తన స్నేహితులతో కామెడీ చేయిస్తూ ప్రేక్షకుల్ని ఎంజాయ్ చేయించాడు. అవసరమైన చోటే ఫైట్స్ చేసే సన్నివేశాలు అమరాయి. ముఖ్యంగా నందిని తమ్ముడు ప్రభాస్ స్నేహితుల్ని బురుడీ కొట్టించే సన్నివేశాలు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. కాజల్ అగర్వాల్ నటన బాగుంది. జోడి సరిపోయింది.స్నేహితుల కుటుంబాల్లో శివన్నారాయణ మాట్లాడితే... తిన్నారా... అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంది. 30 రోజుల్లో ఆంగ్లం నేర్చుకొనలేకపోయినా ప్రభాస్ తల్లి ఆంగ్లంలో మాట్లాడేది రొటీన్ అయినా గుంపులో గోవిందగా కొట్టుకుపోతుంది. ఆహుతి ప్రసాద్ తండ్రి కోట శ్రీనివాసరావు హుందాగా ఉన్నా క్లైమాక్స్‌లో ఒక్క డైలాగ్ మినహా మాటలుండవు. ప్రభాస్ స్నేహితులు, నందిని తమ్ముడి సన్నివేశాలు సరదాగా ఉంటాయి. అయితే కథలో రకరకాల ట్విస్టులతో ప్రేక్షకుల్ని కాస్త చికాకు తెప్పించారు. క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు ఎలాగూ ఒకటవుతారు కాబట్టి ఫ్యాక్షనిస్టు తరహాలో సుమోల్లో వచ్చిన ముఖేష్ రుషి, మళ్లీ ప్రభాస్, నందిని ప్రేమ చూసి చలించిపోతాడు. విలన్‌ను కూడా బఫూన్‌లా చూపించి ఎంటర్‌టైన్ చేశాడు కరుణాకర్.సంభాషణలపరంగా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి టెక్నికల్ తోడై హైదరాబాదు ట్యాంక్‌బండ్, ఛార్మినార్ అంతా మంచుతో కప్పబడి ఉంటే ఎలా ఉంటుందో సరదాగా చూపాడు. పాటలు పెద్దగా గుర్తుండి పోయేలా లేవు. ఒకే ఒక్క పాట బాగుంది. మొదటి భాగం కల్పిత కథతో సరదాగా సాగితే రెండో భాగం సెంటిమెంట్, యాక్షన్‌తో ముగుస్తుంది. ఉల్లాసంగా .. ఉత్సాహంగా తర్వాత కరుణాకరన్ చేసిన చిత్రమిది. ప్రేమ చిత్రాలు తీయడంలో పేరున్న కరుణాకర్ ఈ చిత్రాన్ని మాత్రం అంత గొప్పగా తీయలేకపోయాడు. 80లో కథ ప్రారంభంలో విగ్గులు పెట్టిన దగ్గర్నుంచి చివర్లో ముఖేష్ రుషి విలన్ ప్రేమకు నీరుగారిపోయిన సన్నివేశం వరకూ ఒకరకమైన నవ్వు తెప్పిస్తాయి. భారీ తారాగణంతో రూపొందిన కాలక్షేప చిత్రమిది.