Pages

Wednesday, April 28, 2010

పెళ్లి పీటలపైనే "వధువు"ను చూస్తాననే "వరుడు" ఉంటాడా...?!!


నటీనటులు : అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా, ఆర్య, సుహాసిని, ఆశిష్ విద్యార్థి, షాయాజీషిండే, నాజర్, నరేష్, విజయ, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, శ్రీనివాసరావు, అనితా చౌదరి, బ్రహ్మానందం తదితరులు. సినిమాటోగ్రఫీ : ఆర్.డి, రాజశేఖర్, సంగీతం : మణిశర్మ, ఎడిటింగ్ : ఆంథోని, ఫైట్స్ : స్టన్ శివ, మాటలు : తోట ప్రసాద్, నిర్మాత : డి.వి.వి. దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గుణశేఖర్.పాయింట్ : మంచి సంతానంతో సమాజానికి మేలు చేకూరుతుంది. అక్రమ సంతానంతో సమాజానికి కీడు కలుగుతుందన్న విషయాన్ని గుణశేఖర్ "వరుడు"లో చూపించాడు.కథ : ప్రేమించి పెళ్లిచేసుకున్న వసు (సుహాసిని), గోపి (ఆశిష్ విద్యార్థి) సంతానమే సందీప్ ఉరఫ్ సాండీ (అల్లు అర్జున్). ఇతడికి స్నేహితులతో కలిసి పబ్‌ల్లో ఎంజాయ్ చేయడం మామూలైన విషయం. కానీ పెళ్ళి మాత్రం సాంప్రదాయంగా పెద్దలు కుదిర్చిన వారినే చేసుకుంటాననే నైజం. అది ఎలాగంటే..? తన తాతలు చేసుకున్న వందేళ్ళనాటి పద్ధతి ప్రకారం 16 రోజుల కార్యక్రమంలో ఐదు రోజులు పెళ్ళి తంతు ఉండాలన్నది అతని కోరిక. అప్పట్లో పెళ్ళి కూతుర్ని పీటలపైనే చూసేవారు. అలాగే తనూ చూస్తానని తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్ళికి సిద్ధమవుతాడు సాండీ.పెళ్లికూతురు పేరు దీప్తి (భానుమెహ్రా). ఆమెకూ ఇవే భావాలుంటాయి. గంతకు తగ్గ బొంతలా కుదురుతుంది. సరిగ్గా పెళ్ళిపీఠలపై కూర్చుని జీలకర బెల్లం పెడుతుండగా మంటపం కూలిపోవడం, పెళ్లికూతురు అపహరణకు గురవడం జరుగుతుంది. అపహరణ చేసింది దివాకర్ (ఆర్య), అతనో సైకో. అక్రమసంతానం వల్ల పుట్టినవాడు. సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టించాలో అలా పట్టిస్తుంటాడు. పోలీసులు కూడా అతని ఆగడాలని అరికట్టలేకపోతారు. వాడి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న సందీప్ వాడిని ఎదిరించి వాడికళ్ళముందే అదే పెళ్లిమండపంలో ఎలా పెళ్లిచేసుకున్నాడు? అడ్డువచ్చిన దివాకర్‌ను ఎలా అంతమొందించాడు అన్నది "వరుడు" సినిమా.అల్లు అర్జున్ వయస్సుకు తగ్గట్లుగా బాడీలో ఎనర్జీ పాళ్లు ఎక్కువే. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ (కొంత గ్రాఫిక్స్ అయినా) అది కనపడింది. డైలాగ్ మాడ్యులేషన్ ఎమోషన్‌లో సరిగ్గా సూటుకాలేదు. కానీ వరుడుగా బాడీని కావాల్సినంత ఎక్స్‌ఫోజ్ చేసి ఒక వర్గాన్ని మెప్పిస్తాడు. హీరోయిన్ ఎవరా? అని గోప్యంగా ఉంచి అమృత్‌సర్ అమ్మాయిని చూపించారు. పెళ్లితంతులో ఆభరణాలు, మేకప్‌లో కళ్లకు బాగానే అనిపించింది. కాలేజీ చదివే ఎపిసోడ్‌లో మాత్రం అంత అందం కనబడదు. నార్మల్ గాళ్‌గా ఉంది. ఆమెకు హీరోతో కొద్దిపాటి డైలాగ్స్ మినహా పెద్దగా ప్రాధాన్యత లేదు. దివాకర్ పాత్రలో ఆర్య ఆకట్టుకున్నాడు. అతనిది సైకో పాత్ర. తనకు అడ్డూఅదుపులేకపోతే ఎలా ఉంటాడో చూపాడు. నాటకాలపిచ్చి. కోరింది దక్కకపోతే సహించడు. కామంతో రగిలిపోతుంటాడు. కూష్మాండా అంటూ.. తను నాటకాల్లో వేసిన పాత్రను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెడుపనులు చేస్తుంటాడు. పూర్తిగా ఎమోషనల్ పాత్ర. విలన్‌గా కథాపరంగా సూటయ్యాడు. ఇక సందీప్ తల్లిదండ్రులు, దీప్తి తల్లిదండ్రుల పాత్రలు రొటీన్. తాతగా సింగీతం శ్రీనివాసరావు నటించాడు. దర్శకుడిగా తను పాత్రల నుంచి ఏ మేరకు రాబట్టుకోవాలో ఆయనకు తెలుసుకానీ, తనే నటుడైతే ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలిసిందనుకోవచ్చు. సన్నివేశపరంగా డైలాగ్‌లు చెప్పడంలో.. ఫీలింగ్ ఉండేలా అనిపించవు.ఇక బ్రహ్మానందం పెళ్ళిళ్ల పేరయ్య ఎపిసోడ్ కామెడీకోసం పెట్టినా అది వెగటు పుట్టిస్తుంది. సునీల్, అలీ పాత్రల్ని ఒక పాటలో మినహా ఉపయోగించుకోలేకపోయారు. మొత్తంగా పెళ్ళితంతులో హాస్యం మిస్సయ్యింది. మధ్యమధ్యలో బంధువులంతా కలిసి చమక్కులతో విసిరిన సామెతలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాకు ఈ ఎపిసోడ్ కామెడీకి ప్రాణం. కామెడీని గుణశేఖర్ సరిగ్గా డీల్‌ చేయలేకపోయాడనిపించింది. నిన్నే పెళ్ళాడుతాలో.. సీనియర్ నటీనటులతో హాస్యం పండించినంతగా చేస్తే బాగుండేది. కానీ "వరుడు"లో పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కొత్త వారే. షాయాజీ షిండే హోం మంత్రిగా నటించాడు. నాజర్, రావురమేష్ పోలీసు అధికారులుగా చేశారు.పెళ్ళితంతులో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన సాహిత్యం సినిమాలో హైలైట్ అవుతుందన్న దర్శకుడి మాట నిలబడలేదు. ఒక్కపాటలోనే 16రోజుల తంతును చూపించే ప్రయత్నం చేశాడు. మినహా.. ఏ రోజు ఏం చేస్తారో చూపించలేకపోయారు.మణిశర్మ బాణీలు గుర్తిండిపోయేలా లేవు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్ ఎమోషనల్‌గా సాగుతూ.. ఆసక్తి కలిగించినా కాసేపటికి హీరో ఎత్తైన శిఖరంపై ఉండి ఫైట్ చేయడం విడ్డూరంగా ఉంది. బహుశా అప్పటికే ఎక్కువ ఎక్స్‌పోజింగ్ అయిపోయిందని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. పెళ్ళి గురించే గుణశేఖర్ చెప్పినా.. అందులో అన్ని సరిగ్గా అమరకపోతే పెళ్లెలా పేలవంగా ఉంటుందో ఈ సినిమాకూడా అలాగే ఉంది. ప్రధానంగా హాస్యం లేదు. సునీల్, అలీ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. వారు గెస్ట్‌గా పాటలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. అలాగే పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసే సన్నివేశం బలంగా లేదు. దాంతో కామపిశాచిగా ఆర్య ముద్రపడిపోయాడు. మొదటి నుంచి ఇంటర్‌వెల్ వరకు సీరియల్‌గా కథ నడవదు. సెకండాఫ్‌లో విలన్ ప్రవేశంతో ఎమోషనల్‌గా ఉన్నా స్క్రీన్‌ప్లే లోపంతో ట్రాక్ తప్పింది. కొంతమేరకు సాగదీసినట్లుంది. "సైనికుడు" తర్వాత గుణశేఖర్ నుంచి వచ్చిన "వరుడు" అంత నిరాశపరిచినా.. ప్రస్తుతానికి పెద్ద సినిమాలు ఏమీలేకపోవడంతో కొద్దిరోజులైనా ఆడుతుందనేది మాత్రం నిజం.

No comments:

Post a Comment