Pages

Wednesday, April 28, 2010

శ్రీశ్రీ స్ఫూర్తితో శర్వానంద్ రాజకీయ "ప్రస్థానం"


నటీనటులు: శర్వానంద్, రూబీ పరిహార్, సాయికుమార్, సందీప్, జీవా, జయప్రకాష్ రెడ్డి, సురేఖావాణి, వెన్నెల కిషోర్, రేష్మ, మాస్టర్ అతులిత్ తదితరులు. సాంకేతిక సిబ్బంది : కెమెరా-శ్యామ్ దత్, సంగీతం : మహేష్ శంకర్, నిర్మాత : వల్లభనేని రవి, ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల, కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : దేవకట్టా.మనిషి "ప్రస్థానం" ఎలా ఉంటుందో తన కవిత్వంలో చొప్పించాడు శ్రీశ్రీ. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కథ అల్లాడు దర్శకుడు దేవకట్టా. ఎన్నారై అయిన దేవకట్టా తొలిసారిగా తన స్నేహితులతో కలిసి "వెన్నెల" అనే చిత్రాన్ని తీసి మెప్పించాడు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తీసుకుని కథపై అవగాహనతో ముందుకు వచ్చాడు. అదే "ప్రస్థానం"గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషిలో అసూయద్వేషాలు, కోపతాపాలు, కుటుంబంలో ఒకరు ఎక్కువ, తక్కువ అనే స్వభావాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే విషయాన్ని సజీవ పాత్రల ద్వారా చూపారు. ఇందులో నటీనటులు అందరూ బాగానే చేశారు. శర్వానంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. "గమ్యం" తర్వాత శర్వానంద్‌కు అంతపేరు వస్తుంది. ఇదే కథతో పేరున్న హీరో అయితే సినిమా రేంజే వేరుగా ఉండేది. కథను పూర్తి సీరియస్‌గా తెరకెక్కించిన దేవకట్టా సఫలీకృతుడయ్యాడు. కథలోకి వెళితే.. విజయవాడ నేపథ్యాన్ని దేవరకట్టా ఎంచుకున్నాడు. కృష్ణాజిల్లా మానికొండలో పలుకుబడి కలిగిన రాజకీయనాయకుడు పెద్దాయన (బాలయ్య). ముఠా కక్షల్లో సొంత కొడుకును కేశవ (రవిప్రకాష్)ను కోల్పోతాడు. కేశవ ఆప్త మిత్రుడైన లోకనాధం నాయుడు ఉరఫ్ లోకి (సాయికుమార్). పెద్దాయన కోరిక మేరకు చనిపోయిన మిత్రుడు భార్యను పెళ్లాడటమేగాక, తన మిత్రుని సంతానానికి సవతి తండ్రి అవుతాడు. కాలగమనంలో లోకి కుటుంబం విజయవాడకు మారడంతో లోకి రాజకీయ శక్తిగా ఎదిగి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు. కొడుకు మిత్ర (శర్వానంద్) తండ్రి రాజకీయ వారసత్వంతో యువనేతగా ఎదుగుతాడు. కానీ కూతురు (సురేఖావాణి) డాక్టర్. లోకిని తండ్రిగా భావించదు. మరోవైపు లోకి స్వంత కుమారుడు చిన్న (సందీష్ కిషన్) మిత్ర ఎదుగుదలను చూసి అసూయకులోనై సైకోగా మారుతాడు. భారతంలో భీష్ముని తరహా పాత్రలో సాయికుమార్ నటించాడు. ఆ పాత్రకు, మిత్రా, సైకో చిన్నా ఈ ముగ్గురి జీవన ప్రస్థానం ఏ మేరకు సాగింది? ఇందులో సైకో ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడు? అనేది సినిమా. పాత్రపరంగా అందరూ బాగానే చేశారు. సాయికుమార్ తలపండిన రాజకీయనాయకుడిగా నప్పాడు. ఆయన వాయిస్ థియేటర్లలో ఖంగుఖంగుమని మోగుతుంది. ఆవేశ, శాంత స్వభావ విన్యాసాలు బాగా చేశాడు. శర్వానంద్ సీరియస్‌గా మాస్ తరహా పాత్రను మెప్పించాడు. చెప్పుకోదగిన పాత్ర ఛోటాకేనాయుడు మేనల్లుడు సందీప్ విలన్‌గా బాగా చేశాడు. ఇంకా నవ్యత గల కథ. దేవకట్టా ప్రతి పాత్రను తెరపై మలిచిన వైనం బాగుంది. పాత్రోచితంగా రాసుకున్న స్క్రీన్‌ప్లే, సంభాషణలు ప్రస్థానానికి ప్రాణవాయువు. మంచి చెడులది ఒక్కోసారి పై చేయి.శాందత్ కెమెరా, మహేష్ శంకర్ సంగీతం బాగున్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. మొత్తానికి ఈ వారం విడుదలైన చిత్రాల్లో "ప్రస్థానం" ఉత్తమ చిత్రంగా నిలిచింది.

No comments:

Post a Comment